08/08/2026
డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, నియామకాల్లో అక్రమాలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బద్వేల్ పట్టణంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం సమీపంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి గార్ల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగింది.
మూడో రోజు రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డితో పాటు విద్యార్థి విభాగం, యువజన విభాగం, పార్టీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. దీక్షలో పాల్గొన్న దేవసాని ఆదిత్యరెడ్డి, విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, గారు ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, నియోజకవర్గ పరిశీలకులు దుగ్గాయిపల్లె మల్లికార్జున్‌రెడ్డి గార్లు పూలమాలలు వేసి, పార్టీ కండువాలు కప్పి దీక్షలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై సమగ్రంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి అధికారాలను కేంద్రీకరించడం, ప్రశ్నపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ బాధ్యతలను కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించడం వల్ల పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై అనుమానాలు తలెత్తాయని ఆరోపించారు. అత్యంత రహస్యంగా నిర్వహించాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడింగ్, డిజిటల్ నిర్వహణ వంటి కీలకమైన పనులను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం ప్రశ్నపత్రాల భద్రతపై మరిన్ని సందేహాలకు కారణమైందన్నారు.
ప్రశ్నపత్రాల వ్యవస్థలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పురమ నవీన్ సోషల్ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంకర్‌గా నిలవడం అనేక ప్రశ్నలకు తావిచ్చిందని నాయకులు పేర్కొన్నారు. అనంతరం నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా మెరిట్ జాబితా నుంచి పేరు తొలగించారని, సంబంధిత డేటాను మాయం చేసి కాల్ లెటర్ కూడా పంపలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది, ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది, లీకైన ప్రశ్నపత్రంతో ఎంతమంది పరీక్ష రాశారు, ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే అంశాలను దర్యాప్తు ద్వారా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఆరోపణలను ఖండించడం కాకుండా అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలంటే సీబీఐతో స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ–2025లో స్పోర్ట్స్ కోటా విషయంలో నిబంధనలను మార్చిన తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని నాయకులు అన్నారు. జీవో నంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2 శాతంగా ఉండగా, ఇతర అభ్యర్థులతో సమానంగా అర్హతలు కలిగి సంబంధిత పోస్టుకు పరీక్ష రాయడం తప్పనిసరిగా ఉండేదని తెలిపారు. అయితే డీఎస్సీ–2025లో జీవో నంబర్లు 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు పరీక్షను తొలగించి, కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచారని ఆరోపించారు. అనంతరం స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేసిన తర్వాత జీవో నంబర్లు 4, 47ను రద్దు చేస్తూ, పోటీ పరీక్షను మళ్లీ తప్పనిసరి చేస్తూ జీవో నంబర్ 56 జారీ చేయడం వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మొదట జారీ చేసిన జీవోలు సరైనవే అయితే వాటిని మళ్లీ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తమకు అనుకూలమైన వారికి పోస్టులు కట్టబెట్టేందుకు నిబంధనలను సడలించి, పోస్టుల భర్తీ పూర్తయిన తర్వాత మళ్లీ నిబంధనలను మార్చారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కనపెట్టి, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్థాయిలో పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించారనే ఆరోపణలపై కూడా విచారణ జరగాలని నాయకులు అన్నారు. కొన్ని క్రీడా సంఘాల నుంచి అసాధారణ సంఖ్యలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లు జారీ కావడంపై పూర్తి వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. క్రీడా సంఘాలపై అధికార పార్టీ నేతల ప్రభావం ఉందనే ఆరోపణలను కూడా దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా లోకేష్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ ఉన్నారని పేర్కొంటూ, జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్‌బాల్ నుంచి 38 మందికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. క్రీడా సంఘాలకు నాయకత్వం వహించేది అధికార పార్టీ నేతలే, సర్టిఫికెట్లు జారీ చేసేది కూడా వారి ఆధ్వర్యంలోని సంఘాలే అయితే నియామక ప్రక్రియలో పారదర్శకత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
అదే విధంగా ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు ఉద్యోగం నిరాకరించారనే ఆరోపణలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదని, మరోవైపు జిల్లా, యూనివర్సిటీ స్థాయిలో కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారుడిని పక్కనపెట్టి తక్కువ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి అనుసరించిన ప్రమాణాలు ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల విషయంలో ఒక్కో టీచర్ పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో ఆధారాలు వెలుగులోకి వచ్చాయని నాయకులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ అభ్యర్థితో బేరసారాలు జరిపినట్లు వీడియోలో కనిపిస్తోందని, ఫోన్ నంబర్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేయకుండా ‘అనుమానిత వ్యక్తి’గా మాత్రమే పేర్కొన్నారని ఆరోపించారు. బలమైన సెక్షన్లు నమోదు చేయకుండా నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై వదిలేయడం వెనుక పెద్దల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్న ఆడియో, వీడియోలు, డిజిటల్ ఆధారాలు, ఫోన్ వివరాలు, ఆర్థిక లావాదేవీలను పూర్తిస్థాయిలో పరిశీలించి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిగారు మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలు వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, ఇలాంటి నియామక ప్రక్రియపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎస్సీ కన్వీనర్ నుంచి ప్రశ్నపత్రాల తయారీ, డిజిటల్ నిర్వహణ, పరీక్షల నిర్వహణ వరకు ప్రతి అంశాన్ని దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. నిజంగా ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. సీబీఐ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు వస్తే ఎవరు తప్పు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, నిర్దోషులపై అనవసర ఆరోపణలు లేకుండా వాస్తవాలు కూడా స్పష్టమవుతాయని అన్నారు. డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాల్లో పారదర్శకతపై అభ్యర్థులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అనుమానాలు కలిగే పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించి అభ్యర్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. డీఎస్సీ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను వెంటనే చెల్లించి, కాలేజీల్లో ఫీజుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలపై కూడా నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయని ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మూడేళ్లకు 12 త్రైమాసికాలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం రూ.8,400 కోట్లు కాగా, 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి చెల్లించాల్సిన మరో రూ.700 కోట్లను కలుపుకుంటే రూ.9,100 కోట్లు అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ.2,900 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆరోపించారు. అదేవిధంగా 2024 ఏప్రిల్‌లో చెల్లించాల్సిన వసతిదీవెన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్ మొత్తాలను కలుపుకుంటే వసతిదీవెన కింద బకాయిలు, చెల్లించాల్సిన మొత్తం రూ.3,300 కోట్లకు చేరుతుందని తెలిపారు. మొత్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన కింద బకాయిలు, ఇవ్వాల్సిన మొత్తాలు కలిపి సుమారు రూ.9,500 కోట్ల వరకు ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే ఈ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ భృతిపై కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నెలకు రూ.3,000 చొప్పున ఏడాదికి రూ.36,000, మూడేళ్లకు రూ.1.08 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వెంటనే నిరుద్యోగ భృతిని అమలు చేయడంతో పాటు గత కాలానికి సంబంధించిన బకాయిలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–2025 అక్రమాలపై యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వాస్తవాలను సీబీఐ విచారణ ద్వారా బయటపెట్టాలని, అక్రమాలకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతిని అమలు చేసి యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. డీఎస్సీపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా, విద్యాదీవెన–వసతిదీవెన బకాయిల తక్షణ చెల్లింపు, నిరుద్యోగ భృతి అమలు అనే ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు యువత తరఫున ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అనంతరం మూడో రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డితో పాటు విద్యార్థి విభాగం, యువజన విభాగం, పార్టీ నాయకులకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా గత మూడు రోజులుగా నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, యువజన విభాగం నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత తదితరులందరికీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, దేవసాని ఆదిత్యరెడ్డి గార్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో మూడు రోజుల పాటు దీక్షకు సంఘీభావం తెలిపి ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం, డీఎస్సీ అభ్యర్థుల న్యాయమైన హక్కుల కోసం భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ , పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, యువజన విభాగం నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొని మూడు రోజుల రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై నిష్పక్షపాత విచారణ జరిపించి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాయకులు మరోసారి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.